ప్రణయ్ ని బ్యూటీ పార్లర్ దగ్గరే చంపాలనుకున్నారు.. ఎస్పీ

-

సంచలనం సృష్టించిన‌ మిర్యాలగూడ పరువు హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి మంగళవారం మీడియా ముందుకు జిల్లా ఎస్పీ రంగనాథ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అతి తక్కువ వ్యవధిలోనే వివిధ రాష్ట్రాలకు పారిపోయిన నిందితులను పట్టుకున్నామన్నారు. ప్రణయ్ హత్యకు మొదట 2.5 కోట్ల సుపారీ అడగ్గా.. చివరికి కోటి రూపాయలకు కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ఏ1 నిందితుడు సుభాష్ శర్మ బిహార్ లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన నేర ప్ర‌వృత్తి గల వ్యక్తి. గతంలో ఓ చోరి కేసులో సుభాష్ కు మహమ్మద్ బారి రాజమండ్రి సెంట్రల్ జైలులో పరిచయమయ్యాడు.

ప్రణయ్, అమృత‌ తొమ్మిది తరగతి నుంచే ప్రేమలో ఉన్నారు. హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు ప్రేమ విషయం ఇంట్లో తెలిసి ఈ ఇద్దరు చదువును మధ్యలోనే మానేశారు. ఆ తర్వాత జనవరి 30న ఇంటి నుంచి వెళ్లిపోయి హైదరాబాద్ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. నాటి నుంచి మిర్యాలగూడలోనే నివాసముంటున్నారు. ప్రణయ్ పై నాటి నుంచి కక్ష పెంచుకున్న మారుతీరావు అంతమెందించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ప్రణయ్, అమృత‌ లకు పోలీసుల సూచన మేరకు వారి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు కూడా పెట్టుకున్నారు.

జూన్ నెల నుంచి కూతురుకి దగ్గరవుతున్నట్లు నటిస్తూ హత్యకు పకడ్బందీగా ప్లాన్ చేశాడు మారుతీరావు. ఇందులో భాగంగానే కూతురు గర్భందాల్చిందని తెలుసుకుని డాక్టర్  సాయంతో అబార్షన్ చేయించాలనుకున్నాడు. దీనికి డాక్టర్ ఒప్పుకోకపోవడంతో హత్యకు మరింత ప్రయత్నించాడు. 2011 నుంచి మారుతీరావుతో బారీకి పరిచయాలున్నాయి. అస్గర్, బారీకి జూలై 9,10 తేదీలల్ అడ్వాన్స్ గా రూ. 10 లక్షలు కరీం ద్వారా ఇచ్చారు. ఆగస్టు 9 నుంచి రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 14న మొదసారి హత్యకు ప్రయత్నించారు. అమృత‌ బ్యూటీ పార్లర్ కి వెళ్లినప్పుడు ప్రణయ్ ని చంపేందుకు యత్నించగా ప్రణయ్ తో పాటు సోదరుడు ఉండటంతో కాస్త సందిగ్దానికి తోనై ఆగిపోయారు.  ఆ తర్వాత వెడ్డింగ్ రిసెప్షన్ జరుపుకోవడంతో మారుతీరావు మరింత ఆగ్రహానికి లోనై మరో సారి ప్రణయ్ ని చంపేందుకు సెప్టెంబర్ మొదటి వారంలో యత్నించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 14న జ్యోతి ఆసుపత్రి వద్ద ప్రణయ్ ని హత్య చేశారు. హత్య జరిగిన తర్వాత సుభాష్ శర్మ బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి పాట్నావెళ్లాడు. ప్రత్యేక పోలీసు గ్రూపు పాట్నాలో సుభాష్ శర్మను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రేపు, లేదా ఎల్లుండి సుభాష్ ను నల్గొండ తీసుకొస్తాం అంటూ తెలిపారు.

ఈ హత్య కేసులో ఏ రాజకీయ పార్టీకి ప్రమేయం లేదు, నయీం ముఠాకు సంబంధం లేదు అని  ఎస్పీ వివరించారు. మీడియాలో వస్తున్న అసత్య ఆరోపణలను ఆయన ఖండించారు.

ఏ1 నిందితుడు సుభాష్ శర్మ (ప్రణయ్ ని హత్య చేసిన వ్యక్తి)
ఏ2 మారుతీరావు ( అమృత‌ తండ్రీ)
ఏ3 అస్గర్ ఆలీ  (స్పాట్ లో ఉండి ప్లాన్ చేసిన వ్యక్తి)
ఏ4 మహ్మద్ బారీ ( మొత్తం వ్యవహారానికి డీల్ కుదుర్చుకున్న వ్యక్తి)
ఏ5 అబ్దుల్ కరీం ( మిర్యాలగూడలో ట్రాన్స్ పోర్టు ఆపరేటర్)
ఏ6 శ్రవణ్ ( మారుతీరావు సోదరుడు శ్రవణ్ )
ఏ7 శివ (మారుతీరావు డ్రైవర్ )

Read more RELATED
Recommended to you

Latest news