అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కేసులో ఆశ్చర్యకరమైన నిజాలు తెలుస్తున్నాయి. కిడారికి అత్యంత నమ్మకస్తుడిగా ఉండే ఓ వ్యక్తే ఆయన్ను హతమార్చడానికి మావోయిస్టులకు సహకరించినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. నమ్మించి గొంతుకోసిన ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో కీలక విషయాలు బయటపడుతున్నాయి. బావా బావా.. అంటూ ఆప్యాయంగా పిలుస్తూనే ఆయన ప్రతి కదలికనూ మావోయిస్టులకు చేర వేసి ఆయ హత్యకు కారణమయ్యాడు. హత్యలో మరణించిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమకు ఆ వ్యక్తి దగ్గరి బంధువు. హత్యకు సహకరించిన వ్యక్తి కుటుంబ సభ్యులను గత నాలుగు రోజులుగా పోలీసులు విడివిడిగానూ, కలిపి ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టారు.
ప్రస్తుతం వీరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కిడారి హత్యకు సహకరించకపోతే తమని చంపేస్తామని మావోయిస్టులు హెచ్చరించడంతో సహకరించినట్లు ఒప్పుకున్నారు. అయితే వారికి నెల రోజుల వ్యవధిలో కిడారి, సోమల గురించి సమాచారం అందిస్తూ… పలుమార్లు వసతి సదుపాయం ఎందుకు కల్పించారు అని పోలీసులు ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. హత్య జరిగిన తర్వాత వారిని తప్పించడంలోనూ అతని పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్యను సీరియస్ గా తీసుకున్న తెదేపా ప్రభుత్వం ఇప్పటికే కొంత మంది పోలీసుల అధికారులపై వేటు వేసింది, పూర్తి స్థాయి విచారణ తర్వాత వివరాలను వెల్లడిస్తామంటూ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.