యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని రూపొందించాలని నిర్ణయించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్ కుమార్‌తో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై సుదీర్ఘముగా చర్చించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన యూపీఎస్సీ.. పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియలో పారదర్శకత పాటిస్తోందని.. ఒక్క అవినీతి మరక అంటలేదని ,సుదీర్ఘకాలంగా ఇంత సమర్థంగా యూపీఎస్సీ పనిచేస్తున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.
నియామక ప్రక్రియలో నూతన విధానాలు, పద్ధతులు పాటించాలని అనుకుంటున్నట్లు ఆయనకు సీఎం వివరించారు. నియామకాల ప్రక్రియపై దృష్టిసారించిన సీఎం రేవంత్‌రెడ్డిని కమిషన్ చైర్మన్ మనోజ్ సోని అభినందించారు. యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దాలని అనుకుంటున్నందున టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులకు తాము శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్,సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.