అరసవల్లి ఆలయంలో వరుసగా రెండో రోజూ శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను భానుడి కిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.ఈ అద్భుత ఘట్టాన్ని రెండు కన్నులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సూర్యకిరణ శోభతో దేదీప్యోమానంగా వెలిగిపోతున్న స్వామి వారిని దర్శించుకుని తరించిపోయారు. శ్రీకాకుళం నగరానికి 2 కి.మీ. దూరంలో అరసవల్లి గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం కొలువై ఉంది.
ప్రతి సంవత్సరం దక్షిణాయంలో అనగా అక్టోబర్ 1, 2 తేదీల్లో.. అదేవిధంగా ఉత్తరాయణంలో అనగా మార్చి 9, 10 తేదీల్లో సూర్యకిరణాలు ఆలయంలోని మూలవిరాట్‌ను నేరుగా తాకుతాయి. అయితే, వాతావరణ పరిస్థితుల కారణంగా రెండేళ్లుగా సూర్య కిరణాలు స్వామివారిని తాకలేదు. దీంతో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు.తాజాగా స్వామి వారిని సూర్యకిరణాలు తాకడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి గడియలు ప్రతిఏటా రావాలని,అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు.