ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతోనే పనిచేస్తేనే ప్రజా సంక్షేమ పథకాలు అందరికి చేరి సుపరిపాలన అందుతుందని ఏపీ నూతన సీఎస్ అనిత్ చంద్ర పునిత అన్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఆదివారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… హోదా పెరుగుతున్న కొద్దీ…సమస్యలను తీర్చే బాధ్యతకూడా పెరుగుతోందన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, అధికారులతో కలిసి సమిష్టిగా పనిచేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిచేలా బాధ్యతలు నిర్వహిస్తామని తెలిపారు.
దాదాపు 35 ఏళ్ల ఉద్యోగ సర్వీసులో … కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్‌గా ప్రారంభమైన తన ప్రస్థానంలో వివిధ హోదాల్లో పనిచేసి… చివరకు ప్రధాన కార్యదర్శిగా నియామకమవ్వడం సంతోషంగా ఉందన్నారు. నూతన బాధ్యతల స్వీకరణ సందర్భంగా మాజీ సిఎస్ దినేష్ కుమార్‌తో పాటు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు కోన శశిధర్, ప్రద్యుమ్న వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.