ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు విజేతగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. గత ఏడాది కొద్ది పాటి తేడాతో ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సింధు.. ఈ ఏడాది టైటిల్‌ను సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 21-19, 21-17 తేడాతో నొజోమి ఒకుహారా(జపాన్)ను ఓడించి విజయాన్ని సాధించింది. మరొకవైపు ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను గెలిచి సీజన్‌ను సగర్వంగా ముగించింది.
మొదటి నుంచి ఆధిక్యం కనబర్చిన సింధు తొలి గేమ్‌ను 21-19తేడాతో సొంతం చేసుకుంది. అనంతరం హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో సింధుపై క్రమంగా ఒత్తిడి పెరగడంతో చాకచక్యంగా వ్యవహరించి 21-17 తేడాతో ఒకుహరపై పైచేయి సాధించి పసిడి కలను సాకారం చేసుకుంది. కీలక సమయంలో చక్కటి రిటర్న్‌లతో పాటు.. పదునైన స్మాష్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది…సింధు తన స్మార్ట్ గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్రముఖుల శుభాకాంక్షలు.. వరల్డ్ టూర్స్ ఫైనల్స్ లో టైటిల్ సాధించిన తొలి భారతీయ మహిళాగా రికార్డు సాధించింనందుకు…పీవీ సింధుకి… తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు .. శుభాకాంక్షలు తెలుపుతూ… సింధు మరిన్ని విజయాలను సాధించాలన్నారు.