తెలంగాణ హోంమంత్రిగా మహమూద్ అలీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ప్రభంజనం సృష్టించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తెరాస ఆవిర్భావం నుంచి తన వెన్నంటే ఉన్న, తనకు అత్యంత సన్నిహితుడైన మహమూద్ అలీకి హోంశాఖను కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మహమూద్ అలీ.. అక్కడి నుంచి సచివాలయానికి చేరుకొని సచివాలయంలోని డీ బ్లాక్‌లో తన ఛాంబర్‌లో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీకి రాష్ట్ర డీజీపీ, ఇతర శాఖల ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారికి అత్యంత కీలక శాఖ అయినటువంటి.. హోంశాఖను కేటాయించడంపై తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.