భద్రాచలంలోని వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వరద పంపు బాధితుల పునరావాసానికి సీఎం కేసీఆర్ ప్రకటించిన పదివేల రూపాయల పరిహారం ఆగస్టు 1 నుంచి బాధితుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం జమ చేస్తుంది అని తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్. ఈ మేరకు శనివారం మంత్రి పువ్వాడ అజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
వరద బాధిత కుటుంబాలు ఒక ఇంటికి 20 కిలోల బియ్యం, 5 కిలోల కందిపప్పు, 2 నెలల పాటు ఉచితంగా ఇస్తామని.. అలాగే పదివేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సీఎం కేసీఆర్ భద్రాచలం పర్యటనలో హామీ ఇచ్చారని, ఈ మేరకు బాధితులకు సహాయార్థం సేకరించిన వారి వివరాల ప్రకారం ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే బాధిత కుటుంబాలకు బియ్యం కందిపప్పు పంపిణీ పూర్తయిందని మంత్రి అజయ్ తెలిపారు.
భద్రాచలం ప్రాంతంలో వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ రూ. 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పట్టణ కాంటూరు లెవెల్స్ ను పరిగణలోకి తీసుకొని వరద బాధితులకు ఎత్తైన ప్రదేశాల్లో కాలనీల నిర్మాణం చేపట్టాలని సూచించిన విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్ గుర్తు చేశారు.