ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి పదో తరగతి విద్యార్థిని బలైపోయింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లాలో డెంగ్యూతో విద్యార్థిని మృతి చెందడం కలకలం రేపుతోంది. గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోన్న కావ్య వారం రోజులుగా జర్వంతో బాధపడుతోంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఉపాధ్యాయులు దాచిపెట్టారు. కన్నబిడ్డను కలుసుకునేందుకు వచ్చిన తల్లిదండ్రులు నీరసంగా కనిపించిన కూతురిని తమతో ఇంటికి తీసుకెళ్లారు.
అనంతరం హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించగా డెంగ్యూగా నిర్ధారించారు. ట్రీట్‌మెంట్ జరుగుతుండగా కావ్య మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ బిడ్డ చావుకు ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమంటూ శవంతో స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు.