ఒక వ్యక్తి స్వార్థం కోసమే రుషికొండ ప్యాలెస్ కట్టారు – సీఎం చంద్రబాబు

-

శనివారం విశాఖలో రుషికొండ భవనాలను పరిశీలించారు సీఎం చంద్రబాబు నాయుడు. భవనంలోని అన్ని బ్లాకుల్లో తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భవనాలకు అయిన ఖర్చు పై ఆరా తీశారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుషికొండపై కట్టిన భవనాలు చూశాక ఆశ్చర్యం, ఉద్వేగం కలిగాయని పేర్కొన్నారు.

ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడం ఎక్కడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టూరిజం డెవలప్మెంట్ కోసం ఈ భవనాలు నిర్మించినట్టు గత ప్రభుత్వంలో అనేకసార్లు చెప్పారని, కానీ ఢిల్లీ పెద్దలు వచ్చినప్పుడు విశాఖలోని నేవీ అతిథి గృహంలోనే బస చేస్తుంటారని తెలిపారు. మరి ఎందుకు, ఎవరికోసం ఋషికొండ భవనాలు కట్టారని చంద్రబాబు ప్రశ్నించారు.

ఒక వ్యక్తి స్వార్థం కోసమే రుషికొండ ప్యాలెస్ కట్టారని ఆరోపించారు. కేవలం బాత్ టబ్ కోసం 36 లక్షలు ఖర్చు చేశారని, వీళ్లకు ఎక్కడి నుంచి చూసినా సముద్రం వ్యూ కనిపించాలని, ఆ మేరకే భవనాలు కట్టారని చంద్రబాబు వెల్లడించారు. గతంలో నేను, నా మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రావాలని ప్రయత్నించామని.. కానీ ఎవరిని రానీయకుండా చేశారన్నారు.

ఇవాళ ఇక్కడ ఏం జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. పూర్వం రాజులు, చక్రవర్తులు కూడా ఇలాంటి భవనాలు నిర్మించుకోలేదన్నారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలలో పనికి వస్తారా..? ప్రజలు ఆలోచించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news