అత్యంత పెద్ద వయస్సున్న పన్ను చెల్లింపుదారుగా మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బీనాకు చెందిన 117 ఏళ్ల వృద్ధురాలు గిరిజా భాయి తివారీ రికార్డు సృష్టించారు. 160వ ఆదాయ పన్ను దినోత్సవం(జులై 24) సందర్భంగా ఆమెను సన్మానించింది ఐటీ శాఖ.
దేశంలో గిరిజా భాయితో పాటు మరో ముగ్గురు వందేళ్లు పైబడిన పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర వాసులైన వీరిని కూడా ఈ సందర్భంగా సత్కరించింది ఐటీ శాఖ. అయితే వీరంతా మహిళలే.స్వాతంత్ర్య సమరయోధుడైన సిద్ధార్థ్ తివారీ సతీమణి అయిన గిరిజ భాయి పాన్ కార్డుపై పుట్టిన తేదీ 1903 ఏప్రిల్ 15గా ఉంది. ఆయన మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్వాతంత్ర్య సమరయోధుల పింఛను అందుకుంటున్నారు గిరిజ.గిరిజా భాయిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఐటీ శాఖ అధికారులు.
మా బామ్మ అనేక దశాబ్దాలుగా క్రమంగా పన్ను కడుతూనే ఉంది. నిజాయితీగా పన్ను చెల్లించడంలో ఆమె మాకు స్ఫూర్తి. పన్ను ఎగవేసేవారు మా బామ్మ నుంచి స్ఫూర్తి పొందాలి అని బామ్మ మనవరాలు అంజలి తివారీ అన్నారు.