తిత్లీ ధాటికి ఉత్త‌రాంధ్ర విల‌విల

12 killed, 4 missing after cave hideout crumbles in rockslide triggered by Cyclone Titli


శ్రీకాకుళం: తిత్లీ.. అంతా భయపడినట్లే విరుచుకుపడింది! ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లాలో ఈ పెను తుపాను విధ్వంసం సృష్టించింది. పచ్చని కొబ్బరిచెట్లతో సిక్కోలు కోనసీమగా పేరొందిన ఉద్ధానం ఊపిరి తీసేసింది! గంటకు 165 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన ఈ తుపాను ధాటికి రోడ్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ధ్వంసమవడంతో జిల్లాతో ఉద్ధానం బంధం తెగిపోయింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు దాదాపు పన్నెండు గంటలపాటు ఏకధాటిగా విలయతాండవం చేసిన తిత్లీ దెబ్బకు జిల్లా అతలాకుతలమైంది. గతంలో ఇలాంటి సీజన్‌ల్లోనే దాడి చేసిన ఫైలీన్, హుద్‌హుద్‌ తుపానుల కన్నా మితిమీరిన ప్రతాపంతో విరుచుకుపడడంతో ఉద్ధానం వారేగాక శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా ప్రాణాలు గుప్పిట పెట్టుకుని గజగజ వణికిపోయారు.

తుపాను కారణంగా చెట్లు, ఇళ్లు కూలిన ఘటనల్లో ఏడుగురు మృతిచెందారు. తుపాను సృష్టించిన విధ్వంసానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూకటివేళ్లతో విరిగిపడ్డాయి. పూరిళ్లు పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్‌ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో పాటు పలుచోట్ల విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వందలాది గ్రామాలు, పట్టణాలు అంధకారంలో మునిగిపోయాయి. రైతులకు అపారనష్టం వాటిల్లింది. పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. వరి తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు విజయనగరం జిల్లాపైనా తుపాను ప్రభావం చూపింది. ఇక ఒడిశా రాష్ట్రంపైనా తిత్లీ విరుచుకుపడింది.

ప్రధానంగా గజపతి జిల్లాలో బీభత్సం సృష్టించింది. మొత్తంగా విలయ విధ్వంసం సృష్టించి, భీకర గాలులతో తీవ్ర నష్టాన్ని కలిగించి శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ అతి తీవ్ర తుపాను గురువారం వేకువ జామున 4.30 నుంచి 5.30 గంటల మధ్య తీరాన్ని దాటింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారధి గ్రామం వద్ద గంటకు 150 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటింది. అనంతరం తీవ్ర తుపానుగాను, ఆపై తుపానుగాను మారి గురువారం రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇది ఈశాన్య దిశగా పశ్చిమబెంగాల్‌ వైపు పయనిస్తోంది. గురువారం రాత్రి పది గంటల సమయానికి ఇది ఒడిశాలోని భవానీపట్నాకు తూర్పు ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

వంశధారకు పోటెత్తిన వరద
పలు గ్రామలకు నిలిచిన రాకపోకలు
కొత్తూరు మండలంలో వరద నీరు పోటెత్తడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వంశధార నది నుంచి 1.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించటంతో పెనుగోటివాడ, నివగాం, వసప గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వందలాది ఏకరాల్లో వరి, పత్తి, అరటి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ప్రధాన రహదారిపై 10 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భారీ ఈదురు గాలులకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వందలాది విద్యుత్‌ స్తంభాలు నేలమట్టమయ్యాయి. పలు గ్రామాల్లో వృక్షాలు కూలిపోవటంతో ప్రజలు బయటకు రాలేకపోయారు. తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.