హైదరాబాద్ మహానగరంలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ లోని వందలాది కాలనీలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో… విష జంతువులు కూడా ఈ వరదలతో పాటు కాలనీల్లోకి వస్తున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ లోని మణికొండలో 14 అడుగుల కొండ చిలువ కలకలం రేపింది. దీంతో ఆ కొండ చిలువను చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు.
ఇక అక్కడే వాకింగ్ కోసం వచ్చిన కొందరు వ్యక్తులు… స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు మణికొండకు చేరుకున్న స్నేక్ సొసైటీ ప్రతినిధులు…అక్కడ తిరుతున్న కొండ చిలువను గుర్తించారు. చాలా చాక చక్యంగా వ్యవహరించి కొండ చిలువను పట్టుకొని సంచిలో బంధించింది స్నేక్ సొసైటీ. ఆ తర్వాత కొండ చిలువను అడవిలో వదలి వదిలిపెట్టారు అధికారులు. దీంతో మణికొండ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. వరదలు వస్తున్న నేపథ్యం లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.