టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఓవైపు అభ్యర్థుల భవితవ్యం గందరగోళంలో పడిపోతుంటే.. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. ఇంకోవైపు సిట్.. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్టు చేసి ఈ కేసులో కీలక విషయాలు సేకరించింది. ఈ క్రమంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన ఎన్ ఐ ఆర్ లకు నోటీసులు ఇవ్వాలనే యోచనలో ఉంది.
మరోవైపు పేపర్ లీకేజీ కేసులో 19 మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మి, ప్రవీణ్, రాజశేఖర్ వద్ద పనిచేసిన జూనియర్ అసిస్టెంట్‌లను సిట్ సాక్షులుగా చేర్చింది. సాక్షుల జాబితాలో చేర్చిన వారిలో కర్మన్‌ఘాట్‌లోని ఆర్ స్క్వేర్ హోటల్ యజమాని, సిబ్బంది కూడా ఉన్నారు.
ఈ నెల 4న ఆర్ స్క్వేర్ హోటల్‌లో నీలేష్, గోపాల్‌తో పాటు డాక్యా బస చేశారు. హోటల్‌లో క్వశ్చన్ పేపర్ చూసి ఇద్దరు నిందితులు ప్రిపేర్ అయ్యారు. ఆ తర్వాత నేరుగా పరీక్షా కేంద్రానికి నీలేష్, గోపాల్ వెళ్లారు. హోటల్‌లో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేశారు. మరోవైపు నిన్న అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను ఏడు రోజుల కస్టడీకి సిట్ కోరింది.