భారత్‌లో కరోనా వైరస్ ఎంతలా రెచ్చిపోతుందో చెప్పడానికి ఈ సంఖ్యను చూస్తే చాలు తెలిసిపోతుంది. ఇటీవల ప్రపంచంలో ఒక్కరోజులోనే అత్యధికంగా కేసులు నమోదైన దేశంగా రికార్డు సృష్టించిన భారత్.. తాజాగా ఒక్కనెలలోనే అత్యధిక కేసులు వెలుగుచూసిన దేశంగా కూడా భారత్ నిలిచింది. ఆగస్టు నెలలోనే ఏకంగా 19,87,705 కేసులు నమోదయ్యాయి. ఒక్క నెలలో ఇన్ని కేసులు ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశంలోనూ నమోదుకాకపోవడం గమనార్హం.
అయితే.. గత జూలైలో అగ్రరాజ్యం అమెరికాలో 19,04,462 కేసులు వెలుగుచూశాయి. ఆ రికార్డును భారత్ అధిగమించింది. మరోవైపు దేశంలో కరోనా బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం ఆశాజనక పరిణామం. బుధవారం నాటికి ఈ మరణాల రేటు 1.76 శాతానికి తగ్గిపోయింది. దీంతో ప్రపంచంలో అతి తక్కువ మరణాల రేటు నమోదవుతున్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ప్రపంచంలో సగటు మరణాల రేటు 3.3 శాతంగా ఉన్నది.