తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే రాష్ట్రంలో కొత్తగా 21 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1082కు చేరుకుంది. ఇక కరోనాతో ఇప్పటి వరకు 29 మంది చనిపోగా.. 545 మంది రికవరీ అయ్యారు.
ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం 21 కేసుల్లో 20 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం విశేషం. మరొక కేసు జగిత్యాల జిల్లాలో నమోదైంది. ఇక ఆదివారం 46 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో 508 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది.
కాగా మే 4వ తేదీ సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మూడో విడత లాక్‌డౌన్ మొదలు కానుండగా.. పలు ఆంక్షలను కూడా సడలించనున్నారు. అయితే తెలంగాణలో మాత్రం మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్ ఉండడంతో.. ఆ తరువాతే ఇక్కడ ఆంక్షలను సడలించనున్నట్లు తెలిసింది.