ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్‌కు చెందిన ఆపిల్ స్మార్ట్‌వాచ్ మరోసారి ఒకరి ప్రాణాలను కాపాడింది. హాస్పిటల్‌లో ఈసీజీ చెక్ చేయించుకున్నా.. అంతా బాగానే ఉందని వైద్యులు చెప్పారు. అయినప్పటికీ ఆపిల్ వాచ్ మాత్రం ఆ మహిళకు ఏదో గుండె సమస్య ఉందని తెలియజేసింది. దీంతో ఆమెకు అనుమానం వచ్చి తిరిగి పరీక్షలు చేయించుకోగా.. ఆమెకు గుండె సమస్య ఉన్నట్లు నిర్దారణ అయింది. ఈ క్రమంలో వైద్యులు ఆ మహిళకు శస్త్ర చికిత్స చేసి ఆమె ప్రాణాలను కాపాడారు.
యూరప్‌కు చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధురాలికి తల తిరగడం, ఛాతి నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమె హాస్పిటల్‌కు వెళ్లి ఈసీజీ తీయించుకుంది. అయితే అంతా బాగానే ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. కానీ ఆమె ధరించిన ఆపిల్ వాచ్ మాత్రం ఆమె ఈసీజీని నమోదు చేసి.. ఆమెకు గుండె సమస్య ఉందని అలర్ట్ పంపింది. దీంతో ఆమె మరోసారి హాస్పిటల్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకుంది. ఈ క్రమంలో ఆమెకు రక్తనాళాలకు సంబంధించిన సమస్య ఉందని తేల్చిన వైద్యులు ఆమెకు స్టంట్ వేసి ఆపరేషన్ చేసి ఆమెను బతికించారు. కేవలం ఆపిల్ వాచ్ వల్లే తాను బతికానని ఆమె ఈ సందర్భంగా ఎంతో ఆనందం వ్యక్తం చేసింది.
అయితే గతంలోనూ పలు మార్లు ఆపిల్ వాచ్ ఇలాగే పలువురి ప్రాణాలను కాపాడింది. గుండె సమస్యలు ఉన్నవారి పల్స్, ఈసీజీని నమోదు చేసి అలర్ట్‌లు పంపింది. దీంతో వారు అప్రమత్తమై పరీక్షలు చేయించుకుని, హాస్పిటల్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.