‘రెండువివాహాలు-ఒకమరణం’… ఈ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్నఅపురూపహిందీదృశ్యకావ్యం ‘హమ్ ఆప్ కేహైకౌన్’. సరిగ్గానేటికి 25 వసంతాలుపూర్తిచేసుకున్న ఈ చిత్రం భారత క్లాసిక్స్‌లోఒకటిగానిలిచిపోయింది. సల్మాన్‌ఖాన్-మాధురీదీక్షిత్ జంటపండించిన కెమిస్ట్రీ, తెరమీద నభూతో.. అన్నవిధంగా కనువిందు చేసింది.
ముందుగా కేవలం ఒకే ఒక్క ధియేటర్‌లో విడుదలైన ఈ సినిమా భారత సినిమా చరిత్రలో మరపురాని గుర్తులను లిఖించింది. రిపీట్ ఆడియెన్స్ (మళ్లీమళ్లీచూసిన ప్రేక్షకులు)లో రికార్డులుసృష్టించింది. ఆగస్టు5, 1994న విడుదలైన ఈ చిత్రంలోప్రధానజంటగా సల్మాన్‌ఖాన్, మాధురీదీక్షిత్ నటించగా, మిగతాపాత్రల్లో అనుపమ్ ఖేర్, రేణుకాసహానీ, మెహనిశ్ బెహల్, అలోక్‌నాథ్, రీమాలాగూ మెప్పించారు.
దాదాపు మూడున్నర గంటల సినిమా. 14 పాటలు. ఇంకేదయినా అయుంటే, ప్రేక్షకుల సహనానికి అగ్నిపరీక్షే. కానీ, కుటుంబంలోని అనుబంధాలు, భావోద్వేగాలు, ప్రేమ, త్యాగాలతో ఆనాటి తరానికి తగ్గట్టుగా రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసింది. అద్భుతమైన సంగీతంతో అలరారిన 14 పాటలూ సూపర్‌హిట్. మన గానగంధర్వుడు ఎస్‌పి బాలసుబ్రమణ్యం దాదాపు అన్ని పాటల్లో తన గాన మాధుర్యాన్ని వినిపించారు. లతమ్మ సరేసరి.
ఎప్పుడు చూసినా గంపెండంతమంది జనంతో కళకళలాడుతుండే ఒక కలిగిన ఇల్లు, అంత ధనవంతులైనా, ఆప్యాయతలకు, అనుబంధాలకు ఎంతో విలువిచ్చే సభ్యులు. ఇంట్లో జరగాల్సిన వివాహానికి సందడే సందడి. కథగా మొత్తం చెప్పాల్సివస్తే, సరిగ్గా 40 నిముషాలు కూడా పట్టదు. అలాగని, 14పాటలు, మూడున్నర గంటలపాటు కూర్చోబెట్టే గొప్ప స్క్రీన్‌ప్లే కూడా కాదు. కానీ, కథలో ఉన్న పాయింట్‌ను డివైడ్ చేసిన తీరు, పాటలను కథ మధ్యలో, కథలో భాగంగా కలిపేసిన విధానం, ప్రేక్షకుడు సుఖాంతం వల్ల సంతోషంగా బయటికొచ్చేయడం వంటివి సినిమా బ్లాక్‌బస్టర్ కావడానికి దోహదపడ్డాయి.
చాలామందికి తెలియని విషయమేమిటంటే, ఈ సినిమా ఒక రీమేక్. 1982లో రాజశ్రీ ప్రొడక్షన్స్ వారే నిర్మించిన ‘నదియా ఎ పార్’ అనే చిన్న సినిమాను ఆధునీకరించి, అద్భుతంగా మలిచాడు దర్శకుడు సూరజ్ బర్జాత్యా. ఎవరికీ తెలియని ఆ సినిమా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో బాగా ఆడింది కూడా.
‘హమ్ ఆప్ కేహైకౌన్’కు సంగీతం అందించింది రామ్‌లక్ష్మణ్. వారి ముందు చిత్రం ‘ మైనేప్యార్ కియా’(1989) కు కూడా ఈ జంటే సంగీతం సమకూర్చారు. పద్నాలుగుకు పద్నాలుగు పాటలూ బంపర్‌హిట్లు. ఏ ఒక్కపాట కూడా సిగరెట్ పాటకాదు (అప్పట్లోపాటలొచ్చాయంటే, జనాలుబయటకెళ్లిపోయి, సిగరెట్ కాల్చుకునేవాళ్లు).
ఇక హీరోహీరోయిన్లు, సల్మాన్, మాధురీల జంట చూసేవారిని మైమరపించింది. మాదురీదీక్షిత్ తన అద్భుతమైన అందం, అభినయంతో జనాలను మంత్రముగ్ధులను చేసింది. బయటికి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులను మాధురి చాలాకాలం వెంటాడింది. అప్పట్లో కొంచెం ఒడిదుడుకుల్లో ఉన్న సల్మాన్‌ఖాన్ కెరీర్, ఈ సినిమాలో ఒక్కసారిగా గాడిలోపడి, ఇక వెనక్కితిరిగిచూసుకోనక్కరలేకుండా చేసింది. ప్రతీ అబ్బాయి తనను సల్మాన్‌లా, అమ్మాయిలు మాధురీలా ఊహించుకునేంత మైకం కమ్మేసింది.
రాజశ్రీ ప్రొడక్షన్స్ సంస్థ చాలా ప్రతిష్టాత్మకమైంది. వారికి దేశవ్యాప్తంగా ఆఫీసులు, పంపిణీ నెట్‌వర్క్ ఘనంగా ఉండేది. దాంతో ఈ చిత్రాన్ని పైరసీ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రతీ ప్రింట్‌కు దేశవ్యాప్తంగా ఒక సూపర్‌వైజర్‌ను నియమించారు. ఆయనే ఆ ప్రింట్ పైరసీ కాకుండా బాధ్యత వహించేవాడు. దాంతో అందరూ ఖచ్చితంగా సినిమాను థియేటర్లోనే చూసారు. ముందుగా ఒక థియేటర్లలోనే విడుదల చేసి, క్రమంగా పెంచుకుంటూపోయారు. ఒక ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారం విడుదలైన ఈ చిత్రం దాదాపు అన్ని మహానగరాలలో 25 నుంచి 100 వారాలపాటు ఆడింది. కోటి షేర్ రావడమే గగనమయిన ఆరోజుల్లో, దాదాపు 40కోట్ల షేర్ వసూలు చేసి, బాక్సాఫీసును గడగడలాడించింది.
‘హమ్ ఆప్ కేహైకౌన్’… ఆ తర్వాత అన్నిభాషలలోకి అనువదించారు. తెలుగులో ‘ప్రేమాలయం’ పేరుతో రిలీజైన ఈ సినిమా అలా కూడా బాగా ఆడింది. తెలంగాణలో సాధారణంగా హిందీ బాగావచ్చు కాబట్టి, హిందీవర్షనే దుమ్ములేపింది. ఆంధ్రప్రాంతంలో మాత్రం తెలుగువర్షన్ కనకవర్షం కురిపించింది. ఈ సినిమాకాన్సెప్ట్ ఎంతగా హిట్ అయిందంటే, ఆ తర్వాత అన్నిభారతీయభాషల్లో ఇదే థీమ్‌తో సినిమాలు నిర్మించడం మొదలయ్యింది. ఒకకలిగినఇల్లు, అందరూమంచోళ్లు. సరదాలు, సంతోషాలు. ప్రేమలు, పెళ్లిళ్లు.. అఖరికిఒకట్విస్ట్.. ఇలా.. గుర్తొచిందికదా… ఎస్. మన ‘నిన్నేపెళ్లాడతా’. నాగార్జున-టబు జంటగా నటించిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడు. ఈ సినిమాకు ‘హమ్ ఆప్ కేహైకౌన్’ స్ఫూర్తిగా నిలిచిందని ఆయన పలుసందర్భాల్లో చెప్పాడు.
ఇప్పటికీ టీవీల్లో వచ్చినప్పుడు వదలకుండా చూసేవాళ్లు చాలామంది ఉన్నారు. థియేటర్లోనే సరాసరిన ఈ సినిమాను ఒక్కొక్కరు 10సార్లకు పైగా చూసినట్లు ఒక సర్వే తేల్చింది. భారతీయతను, వివాహవ్యవస్థ గొప్పదనాన్ని, త్యాగానికుండే విలువలను ఎంతో గొప్పగా చాటిచెప్పిన ‘హమ్ ఆప్ కేహైకౌన్’ ఇప్పటికీ, ఎప్పటికీభారతచలనచిత్రచరిత్రలోఅజరామరం.
– చంద్రకిరణ్