బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనీ వద్ద ఓ బాలుడు నాలాలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్(4) మృతదేహాన్ని స్థానికంగా ఉన్న తుర్క చెరువులో డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశారు. మిథున్ మృతదేహాన్ని చూసి.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మిథున్ మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి.. నాలాలో పడిపోయాడు.
దీంతో వరద నీటికి ఆ బాలుడు కొట్టుకుపోయాడు. స్థానికులు గమనించి, అధికారులకు సమాచారం అందించారు. నాలాలో కొట్టుకుపోయిన మిథున్.. నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప వద్ద తేలాడు. అప్రమత్తమైన స్థానికులు, డీఆర్ఎఫ్ బృందాలు బాలుడిని బయటకు తీసేందుకు యత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలం కావడంతో, బాలుడు మళ్లీ చెరువులోకి కొట్టుకుపోయాడు. దీంతో బాలుడి ఆచూకీ కోసం ప్రగతి నగర్ తుర్క చెరువులో డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి, మిథున్ మృతదేహాన్ని వెలికితీశారు.
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే వివేకానందతో కలిసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పర్యటిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఇళ్ళలో నీటిని తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కూకట్ పల్లి జోనల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపునకు గురైన అయోధ్య నగర్, గణేష్ నగర్, ఐడీపీఎల్ కాలనీలో పర్యటించి కాలనీ వాసులకు సహాయక చర్యలు తీసుకుంటామని మేయర్ భరోసా ఇచ్చారు.