గ్రేటర్ లో ఓటు హక్కు వినియోగించుకోని 40లక్షల ఓటర్లు..కారణాలు ఇవే

-

హైదరాబాద్‌ మహానగరం. ఐటీతోపాటు కేంద్రం, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు.. వివిధ కంపెనీలలో పనిచేసే సిబ్బంది పెద్దసంఖ్యలోనే ఉన్నారు. కానీ.. గ్రేటర్ పోలింగ్‌ రోజు మాత్రం ఓటేయడానికి ఆసక్తి చూపించలేదు. 74 లక్షల మంది ఓటర్లలో సగం మంది కూడా ఓటు వేయలేదు. దీనికి కారణం ఏంటి ?

గ్రేటర్‌ హైదరాబాద్‌ లో అక్షరాలా 74 లక్షల 67 వేల 256 మంది ఓటర్లున్నారు. 149 డివిజన్లలో ఓటేసిన వారు కేవలం 34 లక్షల 54 వేల 552 మంది. అంటే ఓటేయని వారు రమారమి 40 లక్షల మంది. ఓల్డ్‌ మలక్‌పేట్‌లో రీపోలింగ్‌ పెండింగ్‌లో ఉంది. పోలింగ్ తక్కువగా నమోదు కావడానికి రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఐటీ ప్రొఫెషనల్స్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల..ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసేవారు. ఈ వర్గాలకు చెందినవారు ఎక్కువ సంఖ్యలో గైర్హాజరయ్యారు.

ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేసేవారు జూబ్లీహిల్స్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎక్కువ ఉంటారు. నగరంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. ఈ మూడు నియోజకవర్గాల్లో వీరి సంఖ్య అధికం. ఈ మూడు నియోజకవర్గాల్లో దాదాపు 24 GHMC డివిజన్లు ఉన్నాయి. ఈ 24 డివిజన్లలో కేవలం బాలానగర్‌, మూసాపేట్‌లలో మాత్రమే 50 శాతం పోలింగ్‌ దాటింది. మిగతా చోట్ల 32 నుంచి 45 శాతం మధ్యే పోలింగ్‌ జరిగింది.

కేవలం నగర శివారు ప్రాంతాలు.. నగరంలో బస్తీలు ఉన్న చోట్ల మాత్రమే ఓ మోస్తరు పోలింగ్‌ నమోదైంది. కారణాలు ఏవైనా వృద్ధులు, పేదలు ఓటేయడానికి ఆసక్తి చూపించారు. విద్యావంతులు మాత్రం పోలింగ్‌ కేంద్రం ముఖమే చూడలేదు. ఈ విషయంలో చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ తీరుపై విమర్శలు చేశారు. అయితే సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేసేవారి వాదన మరోలా ఉంది. తాము వేలు, లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా.. ప్రభుత్వానికి పన్ను కడుతున్నామని చెబుతున్నారు. భారీగా పన్ను చెల్లిస్తున్నా.. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్‌ రావడం లేదన్నది వారి ఆరోపణ. అందుకే ఓటేయడానికి వెళ్లలేదని కొందరు చెబుతున్నారు.

పోలింగ్‌ బూతుల మార్పు.. కోవిడ్‌ భయం..వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సైతం ఐటీ ప్రొఫెషనల్స్‌ ఓటేయడానికి రాకపోవడానికి మరో కారణంగా తెలుస్తోంది. వీరితోపాటు కొందరు ఉద్యోగులు ఓటేయడానికి పోలింగ్‌ బూత్‌లకు వెళ్లినా.. మీ ఓటు ఇక్కడ లేదని.. మరో చోటుకు వెళ్లాలని చెప్పడంతో.. నిరాశ చెంది వెనుదిరిగిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే ఇంట్లో భార్య భర్తల ఓట్లు కూడా వేర్వేరు డివిజన్లకు మారిపోయాయి. ఇవి కూడా ఓటింగ్‌ తగ్గడానికి ఒక కారణంగా విశ్లేషిస్తున్నారు నిపుణులు.

కారణం ఏదైనా.. ఓటు మన హక్కు అన్న నినాదం ప్రచారానికే పరిమితమైంది. దానిని బాధ్యతగా తీసుకుని గడపదాటిన వారు చాలా తక్కుగానే ఉన్నారు. పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా.. ఓటర్లను ఇళ్ల నుంచి కదిలించలేకపోయాయి. సోషల్ మీడియాల్లో యాక్టివ్‌గా ఉండేవారు.. ఓటింగ్ రోజున బయటకొచ్చి పోలింగ్‌ కేంద్రం వరకు నాలుగు అడుగులు వేయలేకపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news