పశ్చిమ ఇరాక్‌లోని ఐన్ అల్-అసద్ వైమానిక స్థావరంపై ఈ నెల ప్రారంభంలో ఇరాన్ క్షిపణి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పలువురు అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడినట్టు పెంటగాన్ తాజాగా ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఇరాన్ దాడుల్లో ఎవరూ గాయపడలేదని, అంతా బాగుందని ప్రకటించగా అది అంతా అబద్దమని పెంటగాన్ ప్రకటనతో తేలిపోయింది.
పెంటగాన్ ప్రతినిధి జోనాథన్ హాఫ్మన్ విలేకరులతో మాట్లాడుతూ 17 మంది అమెరికా ఆర్మీ విధులకు హాజరయ్యారని, 34 మంది మాత్రం తీవ్రమైన మెదడు వ్యాధితో బాధపడుతున్నారని పేర్కొన్నారు. కొంత మందిని జర్మని పంపించి చికిత్స అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే పెంటగాన్ చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే ఇరాన్ దాడిలో గాయపడిన అమెరికా సైనికులు కొంత మంది కంటి చూపు కోల్పోయినట్టు సమాచారం.
అలాగే వారి శరీర అవయావాల్లో కీలక అవయవాలకు గాయాలు అయ్యాయని సమాచారం. తలనొప్పి, మైక౦ మరియు వికారం, కాంతిని చూడలేకపోవడం వంటి లక్షణాలతో వారు ఇబ్బంది పడుతున్నారని అధికారులు పేర్కొన్నారు. అయితే ట్రంప్ మాత్రం వారికి తల నొప్పి ఒకటే ఉందని చెప్పే ప్రయత్నం చేసారు. ఇక ఇదిలా ఉంటే దీనిపై అక్కడి పార్లమెంట్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. ట్రంప్ చర్యలతో అనవసరంగా ఆర్మీ ఇబ్బందులు పడుతుందని ఆగ్రహంగా ఉంది.