దేశవ్యాప్తంగా నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు వంట గ్యాస్ ధరలు కూడా సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. వంట గ్యాస్ ధర తాజాగా రూ.25 పెరిగింది. దీంతో గ్యాస్ బండ గుండెల మీద గుది బండగా మారింది.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రోజు కారోజు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే పెరుగుతున్న ఇంధన ధరలపై జోకులు వేస్తున్నారు. ఇక ఇటీవలే కరూర్ జిల్లాలో తిరువల్లువర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుక్కురల్ పద్యాన్ని పాడిన వారికి ఓ పెట్రోల్ పంప్ ఓనర్ ఉచితంగా పెట్రోల్‌ను అందించి వార్తల్లో నిలిచాడు.
కాగా మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న వ్యక్తికి 5 లీటర్ల పెట్రోల్‌ను ఉచితంగా అందజేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడి కాంగ్రెస్ నాయకుడు మనోజ్ శుక్లా ఆ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించగా అందులో ఓ మ్యాచ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించిన సలావుద్దీన్ అబ్బాసీ అనే వ్యక్తికి శుక్లా ఉచితంగా 5 లీటర్ల పెట్రోల్‌ను అందించారు. ఇక రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా ఎంత వరకు పెరుగుతాయోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.