ముగ్గురు వ్యక్తులు, మరో ఇద్దరు బాలురు మొత్తం 5 మంది కలిసి ఓ క్యాబ్‌ను దొంగిలించారు. క్యాబ్ డ్రైవర్‌ను చితకబాది అతని వద్ద నుంచి ఫోన్, డబ్బు లాక్కున్నారు. తరువాత పరాఠాలను తినేందుకు వెళ్దామనుకున్నారు. కానీ వారిలో వారికి గొడవ రావడంతో ఓ ఈటరీ నుంచి ఫుడ్‌ను కొనుగోలు చేసి దాన్ని తిని అక్కడి నుంచి ఉడాయించారు. ఈ క్రమంలో నిందితులను పోలీసులు ట్రేస్ చేసి అరెస్టు చేశారు. ఈ సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఢిల్లీలోని నంగ్లోయి ప్రాంతంలో నివాసం ఉండే పంకజ్ (19), అభిజిత్ (19), సాగర్ (20) అనే ముగ్గురు వ్యక్తులు ఆగస్టు 30న ఓ సెల్ ఫోన్ దొంగిలించారు. దాంట్లో ఉన్న ఓ క్యాబ్ యాప్‌లో క్యాబ్ బుక్ చేసుకున్నారు. హర్యానాలో ముర్తల్ విలేజ్‌కు వెళ్లి అక్కడి ఫేమస్ పరాఠాలను తిందామని అనుకున్నారు. వారికి తోడుగా మరో ఇద్దరు బాలురు కలిశారు. ఈ క్రమంలో క్యాబ్ రాగానే వారు అందులో ఎక్కి కొంత దూరం వెళ్లాక.. రాజధాని పార్క్ వద్ద వారందరూ క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదారు. అతని వద్ద ఉన్న ఫోన్‌ను, డబ్బును లాక్కుని ఆ కారు లోంచి డ్రైవర్‌ను కిందకు తోసేసి, అందులోనే హర్యానాకు బయల్దేరారు.
అయితే వారిలో వారికి తగవులు రావడంతో చివరకు వారు పశ్చిమ ఢిల్లీలోని పశ్చిమ విహార్‌లో ఉన్న ఓ ఈటరీ నుంచి ఫుడ్‌ను కొనుగోలు చేశారు. ఫుడ్ తిన్నాక కారును నిహాల్ విహార్ ఏరియాలో పార్క్ చేశారు. అయితే క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ 5 మందిలో ఇద్దరిని అరెస్టు చేశారు. దీంతో వారు తాము చేసిన నేరాన్ని అంగీకరించి మిగిలిన వారి వివరాలు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు మిగిలిన ముగ్గుర్ని కూడా అరెస్టు చేశారు.