దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఏరోజు కారోజు పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ఉండే చమురు ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తున్నారు. అయితే దేశంలో ప్రస్తుతం 90 శాతం మేర పెట్రోల్ పంపులు ప్రభుత్వ కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తుండగా ఇకపై ఈ రంగంలో మరిన్ని ప్రైవేటు కంపెనీలు రానున్నాయి. త్వరలోనే మరో 6 కొత్త ప్రైవేటు కంపెనీలు ఇంధన రంగంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది.
ఐఎంసీ, ఆన్‌సైట్ ఎనర్జీ, అస్సాం గ్యాస్ కంపెనీ, ఆర్ఎంబీఎల్ సొల్యూషన్స్ ఇండియా, మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఎంకే ఆగ్రోటెక్ కంపెనీలు ఇంధన రంగంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. వీటికి కేంద్రం త్వరలో లైసెన్స్‌లను ఇవ్వనున్నట్లు లైవ్ హిందూస్తాన్ ఒక కథనాన్ని వెలువరించింది. దాని ప్రకారం మార్కెట్‌లో మొత్తం ఇంధన కంపెనీల సంఖ్య 14కు చేరుతుందని తెలుస్తోంది.
2019లో సవరించిన మార్కెట్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫ్యుయల్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రైవేటు కంపెనీలకు ఇంధన రంగంలోకి అనుమతులు ఇచ్చారు. అయితే కొత్త కంపెనీలు రావడం వల్ల పోటీ ఉంటుందని, దీంతో ఇంధన ధరలు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రూ.250 కోట్ల కనీస విలువ ఉన్న కంపెనీలకు పెట్రోల్ పంప్ లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తారు. ఈ క్రమంలోనే కొత్త కంపెనీలు 5 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కనీసం 100 పెట్రోల్ పంప్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాటిల్లో కనీసం 5 పంప్‌లు మారుమూల గ్రామాల్లో ఉండాలి. దీంతో ఆ కంపెనీల లైసెన్స్‌లను కొనసాగిస్తారు.