ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్ కాలమానం ప్రకారం. ఉదయం 8:03 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.4 గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం పేర్కొంది. మనీలాకు 451 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు.
పైగా తీర ప్రాంత నగరం కావడం వల్ల సునామీ భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. సునామీ ముప్పు సంభవించే ప్రమాదం ఉందంటూ స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మనీలా అధికారులు చెప్పారు. ఫిలిప్పీన్స్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్న దేశం కావడం వల్ల తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.