బ్యాంకులంటే అంతే.. బడాబాబులకు రెడ్ కార్పెట్లు వేస్తాయి.. రా రమ్మంటూ ఆహ్వానిస్తాయి. వారు రమ్మంటే పరిగెత్తుకుని వెళ్లి సేవలు అందిస్తాయి. కానీ పేదల విషయానికి వస్తే.. వారివైపు కన్నెత్తి కూడా చూడరు. వారిని పట్టించుకోరు. పేదలు కదా.. అందుకే బ్యాంకు వారు లెక్క చేయరు. ఒడిశాలోని ఆ వృద్ధురాలికి కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అక్కడి ఓ బ్యాంకు అధికారి పైశాచికత్వం వల్ల ఆ వృద్ధురాలు గోస పడాల్సి వచ్చింది.
ఒడిశాలోని నౌపాడ జిల్లా బర్గావ్ గ్రామానికి చెందిన ఓ 100 ఏళ్ల వృద్ధురాలికి జన్ ధన్ ఖాతా ఉంది. అందులో కేంద్రం ప్రభుత్వం గత మూడు నెలలుగా అందజేసిన కోవిడ్ 19 సాయం మొత్తం కలిపి రూ.1500 ఉన్నాయి. వాటిని విత్‌డ్రా చేసుకురమ్మని ఆమె తన 70 ఏళ్ల కూతురును బ్యాంకుకు పంపింది. అయితే బ్యాంకులో ఉండే మేనేజర్ అజిత్ ప్రధాన్ మాత్రం కర్కశంగా వ్యవహరించాడు. మంచంలో ఉండి కనీసం లేవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలంటూ బ్యాంకుకు రమ్మన్నాడు.
An elderly woman had to drag her 100-year-old mother on a cot to the Bank , at Nuapada District of Odisha, as officials refused access to her Jan Dhan Yojana account without physical verification.The incident took place three days back but videos viral on Saturday pic.twitter.com/gJ5MBPR8jQ
— kalpataru ojha (@Ojha_kalpataru) June 14, 2020
కాగా ఆ వృద్ధురాలి కూతురు పలు మార్లు బ్యాంకు చుట్టూ తిరిగినా ఆ మేనేజర్ కనికరించలేదు. తన తల్లి లేవలేని స్థితిలో ఉందని వేడుకుంది. అయినా అతను వినకుండా తనలో ఉన్న పైశాచికత్వ ధోరణిని చాటుకున్నాడు. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ఆ వృద్ధురాలు కచ్చితంగా బ్యాంకుకు రావాల్సిందేనని చెప్పాడు. దీంతో ఆమె కూతురు గత్యంతరం లేక మంచంలో పడుకుని ఉన్న తన తల్లిని మంచంతోపాటే బ్యాంకుకు ఈడ్చుకుంటూ తీసుకువెళ్లింది. కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ కావడంతో అందరూ ఆ బ్యాంక్ మేనేజర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వృద్ధురాలు అంతటి దీనస్థితిలో ఉంటే ఆమె దగ్గరకే వెళ్లాల్సిందిపోయి.. అంత నీచంగా ప్రవర్తిస్తారా.. అంటూ అతనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. అవును మరి.. ధనికులకు అయితే అయ్యా.. బాబూ.. అంటూ వారు సేవ చేస్తారు. అదే పేదలకు అయితే.. ఇదిగో పరిస్థితి ఇలా ఉంటుంది. వారి నిర్లక్ష్య వైఖరికి ఇంతకు మించిన పెద్ద ఉదాహరణ ఇంకేముంటుంది చెప్పండి..!