తెల్లరితే తనను మించిన వ్యూహకర్త లేరని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు… ఎందుకో గానీ ఈ మధ్యకాలంలో సరైన వ్యూహాలు చేయలేకపోతున్నారు. ఎన్నికల ముందు నుంచి ఈ పరిస్థితి మొదలైందనే చెప్పుకోవాలి. అప్పటివరకూ మిన్నకుండి.. సరిగ్గా ఎన్నికలకు ముందు “పసుపూ – కుంకుమ వ్యూహం” పన్నినా… ఆ వ్యూహాన్ని ప్రజలు అర్ధం చేసేసుకున్నారు.. ఫలితం 23! అనంతరం అసెంబ్లీలో ఎన్ని వ్యూహాలు పన్నుదామన్నా ఫలితం లేకుండా పోయింది. అమరావతి పేరు చెప్పి “కమ్మ సామాజిక వర్గ వ్యూహం” పన్నినా… కొడాలి నాని రూపంలో ఆ వ్యూహం కూడా ఫలించలేదు!
ఇదే క్రమంలో అసెంబ్లీలో కాస్త గట్టిగా మాట్లాడి… ప్రభుత్వం తీసుకున్న “శాసనమండలి రద్దు” నిర్ణయంపై వ్యూహాలు పన్నాలని ప్లాన్ చేసేలోపు… గతంలో శాసనమండలి అవసరం లేదు అనేస్థాయిలో బాబు చేసిన ప్రసంగాన్ని వీడియో రూపంలో చూపించారు పేర్ని నాని. అక్కడితో ఆ వ్యూహమూ పోయింది! “కరోనా” పేరుచెప్పి ఏపీలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టలని, తద్వారా అయినా ప్రజల్లోకి వెళ్లాలని పక్కా ప్లాన్స్ వేసుకున్నా… అది ఆన్ లైన్ కం లాక్ డౌన్ లోనే కలిసిపోయింది! ఇక “విశాఖ ఎల్జీ పాలిమర్స్” ఘటన సమయంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని ప్రయత్నించినా, సీపీఐ లాంటి రహస్య స్నేహితులతో విమర్శలూ గట్రా చేయిద్దామన్నా… జగన్ కోటి రూపాయల దెబ్బతో అదీ పోయింది.
పోనీ ఎల్జీ పాలిమర్స్ బాధితులను కలిసే క్రమంలో.. ఆ కోటిని కూడా కాదని, “ప్రాణాలే ముఖ్యమని వ్యూహం” పన్నుదామనుకుంటే… మోడిని అడిగిన అనుమతి, జగన్ అడగడంలో అభిజాత్యం అడ్డొచ్చింది… ఫలితంగా అదీ పోయింది! ఏపీలో “కరోనా కేసులు పెరుగుతున్నాయని”, జనం భయభ్రాంతులకు గురవుతున్నారని ఆ రకంగా నరుక్కొద్దామని వ్యూహం పన్నినా… అధిక సంఖ్యలో టెస్టులు చేయడం వల్లే అని అధికారపక్షం నుంచి, రికార్డు సంఖ్యలో టెస్టులు చేసి వైరస్ ను నియంత్రించే పనిలో ఏపీ దూకుడుగా వెళ్తుందని జాతీయ మీడియా సైతం ప్రశంసించే సరికి.. ఆ వ్యూహమూ పోయింది. కరోనా సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయే సరికి జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న “నవరత్నాలకు న్యాయం జరగదేమో” అని వ్యూహాలు సిద్ధం చేసుకున్నా… జగన్ వెనక్కి తగ్గకపోయే సరికి అదీ పోయింది.
విధ్వంశానికి వన్ ఇయర్ అంటూ జగన్ ఏడాది పాలన అంతా అవినీతి మయం అని “ఒక బుక్కేసి వ్యూహ రచన” చేసినా… దానికి అనుకూల పత్రికల్లో వచ్చిన కవరేజిలో 10వ వంతు ప్రజల్లో రాలేదని తమ్ముళ్లే అంటున్న పరిస్థితి. ఇక గతంలో తాము అవినీతి చేశామని చెబుతున్న జగన్ ప్రభుత్వానికి ధమ్ముంటే, ధైర్యం ఉంటే నిరూపించాలని తద్వారా తాము నీతిమంతులమని, జగన్ అవినీతిపరుడని జనాలకు చెప్పాలనే వ్యూహం పన్నితే… సీబీఐ ఎంక్వైరీతో అదీ పోయింది. అచ్చెన్నా అరెస్టుతో “బీసీలకు అన్యాయం” అనే వ్యూహం పన్నితే… ఆ వర్గం నుంచి స్పందన కరువైంది.. ఫలితంగా ఆ వ్యూహమూ పోయింది. ఇదే క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుతో “జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారనే వ్యూహాన్ని” తీస్తే… దానికీ స్పందించే నాథుడే కరువయ్యాడు.. అదీ పోయింది!
దీంతో బాబుపై టీడీపీ శ్రేణులు కోపోద్రిక్తులవుతున్నారంట. “నాటి బాబు నేడేడి” అని ప్రశ్నిస్తున్నారంట. ఈ “పదును తగ్గడంలో చినబాబు పాత్ర” అనుమానంపై కారాలూ మిరియాలు నూరుతున్నారంట. జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పి, రాష్ట్రపతిని సైతం నియమించడంలో కీలక భూమిక పోషించామని చెప్పుకున్న వ్యూహాలు నేడు ఏవని అడుగుతున్నారంట. “వారితో పొత్తు చారిత్రక తప్పిదం” అన్న బీజేపీతోనే మళ్లీ పొత్తు పెట్టుకోవడంలో పన్నిన్న వ్యూహాలు నేడేమైపోయానని చర్చలు చేస్తున్నారంట. “అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు” అయినా కూడా ఏదో సాదిద్ధామని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధం చేస్తూ, ఏపీ రాజకీయల్లో పవన్ ని ఆటలో అరటిపండును చేసిన వ్యూహం నేడు కరువైందని ఫీలవుతున్నారంట. ఫైనల్ గా… “వయసు పెరిగిందా లేక మెదడుకు పదును తగ్గిందా” అని ఆలోచనలో పడ్డారంట తమ్ముళ్లు!!