అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు. కానీ ఓ తల్లి మాత్రం కొడుకు అన్నం పెట్టమని పేచీ పెట్టినా పెట్టడం లేదు. అంతేకాకుండా ఆ చిన్నారి అన్నం తింటుంటే అతడి ప్లేటును లాగేసి విసిరేస్తోంది. వింటుంటే.. ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అనిపిస్తోంది కదూ. కానీ ఇలాంటి తల్లి కూడా ఉంది. తల్లి ప్రవర్తనతో విసిగిపోయిన ఎనిమిదేళ్ల బుడ్డోడు పోలీసులను ఆశ్రయించాడు. ఏకంగా కన్నతల్లిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బిహార్ సీతామఢీలోని చంద్రిక మార్కెట్ వీధి సిటీ పోలీసుల ముందు ఏడుస్తూ నిలుచున్న ఆ చిన్నారిని చూసి ఏమిచేయాలో కాసేపు వారికి పాలు పోలేదు. ముందుగా కడుపు నిండా అన్నం పెట్టారు. కాసేపయ్యాక అతడి వివరాలు ఆరా తీశారు. అతడు చెప్పిన మాటలు విని విస్తుపోవడం పోలీసుల వంతయింది. ఇంతకీ ఆ బాలుడు పోలీసులతో ఏం చెప్పాడంటే.. ‘అన్నం అడిగితే అమ్మ కొడుతోంది. వేళకు అన్నం పెట్టదు. ఒక్కోసారి నేను తింటుంటే పళ్లెం లాక్కొని విసిరేస్తుంది సార్’ అంటూ తల్లిపై ఫిర్యాదుతో పోలీస్‌స్టేషనుకు వచ్చిన 8 ఏళ్ల బాలుడిని చూసి బిహార్ పోలీసులు విస్తుపోయారు.
వివరాలు ఆరా తీస్తే.. తాను నాలుగో తరగతి చదువుతున్నానని, నాన్న మరోచోట ఉంటాడని బాలుడు తెలిపాడు. చెప్పిన చిరునామా ప్రకారం పోలీసులు ఆ బాలుణ్ని ఇంటికి తీసుకువెళ్లారు. తల్లిని విచారించగా.. అలాంటిదేం లేదని, ఒక్కోసారి అల్లరి చేస్తే తిడుతుంటానని ఆమె చెప్పారు. ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి తాము వెనుదిరిగినట్లు పోలీసు అధికారి రాకేశ్ కుమార్ తెలిపారు.