భారత్‌లో ప్రస్తుతం పెద్ద ఎత్తున కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్న విషయం విదితమే. జనవరి 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా రోజుకు దాదాపుగా 1 లక్ష మంది ఫ్రంట్ లైన్ వారియర్లకు టీకాలను ఇస్తున్నారు. తొలి దశలో 3 కోట్ల మందికి టీకాలను ఇస్తారు. ఆ తరువాత 50 ఏళ్లకు పైబడిన వారికి, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి టీకాలను ఇస్తారు. అయితే టీకా పంపిణీ ప్రారంభమై దాదాపుగా వారం రోజులు కావస్తున్న నేపథ్యంలో మేడిన్ ఇండియా కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల ప్రజలకు ఎలాంటి దుష్పరిణామాలు కలగని కారణంగా మన వ్యాక్సిన్లకు గిరాకీ పెరిగింది.
భారత్ లో అందిస్తున్న వ్యాక్సిన్ల వల్ల దాదాపుగా చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం, ధర తక్కువ ఉండడం, ప్రభావం బాగానే చూపిస్తుండడం.. వంటి కారణాల వల్ల అనేక దేశాలు మన దగ్గర ఉత్పత్తి అవుతున్న కోవిడ్ వ్యాక్సిన్ల కోసం క్యూ కడుతున్నాయి. ఇప్పటికే పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ లకు ఆయా దేశాల విజ్ఞప్తిపై భారత్ కోవిడ్ వ్యాక్సిన్లను పంపుతోంది. ఇక ఈ జాబితాలో రోజు రోజుకీ కొత్త దేశాలు చేరుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ల కోసం ప్రస్తుతం 92 దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఇటీవలే డొమినికన్ రిపబ్లిక్ ప్రధాని రూజ్‌వెల్ట్ స్కెరిట్ వ్యాక్సిన్ కోసం లేఖ రాయగా, త్వరలో వారికి 72వేల డోసులను పంపించనున్నారు. బ్రెజిల్ ఇప్పటికే వ్యాక్సిన్ల కోసం అభ్యర్థించింది. దీంతో అక్కడికి త్వరలో 20 లక్షల డోసులను పంపించనున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ బ్రెజిల్‌కు వెళ్లనుంది. ఇక బొలీవియా, సింగపూర్ వంటి దేశాలు కూడా భారత్‌లో సంప్రదింపులు జరుపుతున్నాయి. అలాగే పాకిస్థాన్, చైనా కోరితే వారికి కూడా వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని, ఈ విషయంలో ఆ దేశాలకు సహకారం అందిస్తామని భారత్ ఇప్పటికే తెలిపింది. ఈ క్రమంలో భారత్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ పట్ల అనేక దేశాలు ఆసక్తి చూపిస్తుండడం భారత్‌కు ఎంత గర్వకారణమని, ఇక్కడి ఫార్మా రంగానికి ఈ విధంగా మరింత ఊతం లభిస్తుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.