స్కూల్ బస్సు మిస్.. తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకోవడం ఎక్కువైంది. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఎక్కువగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. స్కూల్ బస్సు మిస్సయిందని తొమ్మిదో విద్యార్థి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం బెథుల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన జిల్లా కేంద్రానికి 40 కి.మీ. దూరంలోని అమ్దోహ్ గ్రామంలో జరిగింది.

అమ్దోహ్ గ్రామానికి చెందిన 14ఏండ్ల బాలుడు ఓ ప్రైవేటు స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్కూల్ బస్సు నుంచి వెళ్లిన ఆ బాలుడు బస్సు ఎక్కలేకపోయాడు. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన బాలుడు స్కూల్ బస్సు మిస్సవ్వడంపై కుటుంబ సభ్యులకు తెలిపి బాధపడ్డాడు. అనంతరం ఇంటి వెనుక వైపు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్ యూనిఫాంలో చెట్టుకు వేలాడుతున్న కొడుకు శవాన్ని చూసిన కుటుంబ సభ్యులు రోదించడం స్థానికులను కలిచివేసింది.

ఆ బాలుడి అంకుల్ మీడియాతో మాట్లాడుతూ స్కూల్‌కు ఏనాడూ ఆలస్యంగా వెళ్లేవాడు కాదని తెలిపారు. చదువులో కూడా మంచి ప్రతభ కనబర్చేవాడని చెప్పారు.

చదువు పట్ల కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి కారణంగా కొంత మంది విద్యార్థులు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండటం వల్ల కూడా ఆత్మహత్య వంటి పెడ ధోరణుల వైపు ప్రేరేపిస్తుందని చిన్న పిల్లల నిపుణుడు చెప్పారు.