ఏడాదిన్నర క్రితం ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆయన కుటుంబం అంత్యక్రియలు చేపట్టకుండా మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టంది. స్థానికులు అతడి గురించి అడిగినప్పుడు కోమాలో ఉన్నాడని అబద్ధం చెప్పింది. దాదాపు ఏడాదిన్నరపాటు ఆ వ్యక్తి చనిపోయాడని.. అతడి మృతదేహం వారి ఇంట్లోనే ఉందని ఎవరికీ తెలియదు. కానీ చివరకు ఇటీవల బయటపడింది. ఎలాగంటే..?
ఉత్తర్ ప్రదేశ్ లోని రావత్‌పుర్‌లోని శివపురి ప్రాంతానికి చెందిన విమలేశ్(38) అనే వ్యక్తి .. అహ్మదాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖలో పనిచేసేవాడు. 2021 ఏప్రిల్ 22న అతడు మరణించాడు. అయితే విమలేశ్ మృతి చెందినా.. అతడు కోమాలో ఉన్నాడని అందరికీ చెబుతూ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు కుటుంబసభ్యులు. అయితే విమలేశ్ భార్య మిథాలీ స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తుంది. పెన్షన్ దరఖాస్తు చేయడానికి విమలేశ్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె సమర్పించడంతో మొత్తం విషయం బయటపడింది. ఆదాయ పన్నుశాఖ.. సీఎంవోకు ఈ విషయాన్ని తెలియజేసింది. సీఎంవో వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఆదేశించింది.
సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే విమలేశ్ ఇంటికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్‌లో ఎల్ఎల్ఆర్ ఆస్పత్రికి తరలించారు. అసలు ఆ కుటుంబం ఇంట్లోనే అతడి మృతదేహాన్ని ఎందుకు ఉంచిందో ఇప్పటి వరకు తెలియలేదు.