పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం.. ఉపాధ్యాయుడే విద్యార్థిపై అత్యాచారం..

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న బాలికపై అదే స్కూల్‌లో తెలుగు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. జిల్లాలోని దేవరపల్లి మండలం త్యాజంపూడికి చెందిన కొయ్య లక్ష్మయ్య జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుకుంటున్న బాలికపై నాలుగు నెలల క్రితం లక్ష్మయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు.

అయితే, రెండు రోజుల క్రితం ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు నిన్న పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిని చితకబాదారు.అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఉపాధ్యాయుడి బంధువులు దాడి నుంచి అతడిని రక్షించి ఓ గదిలోకి తీసుకెళ్లి గడియపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్కూలుకు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. అనంతరం నిందితుడైన ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు.