దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంది. నగరంలోని మూసీ నదికి పునరుజ్జీవం కోసం రాష్ట్ర మంత్రుల బృందం సియోల్‌లోని నదుల అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు ఆ దేశంలో పర్యటించిన విషయం తెలిసిందే. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డిలతో కూడిన బృందం పర్యటన ముగించుకుని తాజాగా నగరానికి చేరుకుంది.
ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పొంగులేటి, పొన్నం, ప్రభుత్వ సలహదారుడు నరేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యదయ్యల బృందానికి గ్రంథాలయ సంస్థ చెర్మన్ మధుసుదన్ రెడ్డి, మాజీ కార్పోరేషన్ చెర్మన్ రవిలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సియోల్ పర్యటనలో భాగంగా వీరంతా చియంగ్ చూ నది, హాన్ నది పునరుజ్జీవ ప్రాజెక్ట్‌లను సందర్శించారు. హాన్ నది సియోల్ నగరంలో 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది.