ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భోపాలపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.పొండపల్లి గ్రామానికి చెందిన తాటి కన్నయ్య అనే గ్రామస్తుడిని మావోయిస్టులు హత్య చేశారు. అతన్ని ఇన్‌ఫార్మర్‌గా భావించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. తమ కదలికలను ఎప్పటికప్పుడు భద్రతా బలగాలకు చేరవేస్తున్నాడని వారు ఆరోపిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇదిలాఉండగా, రెండ్రోజుల కిందట ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.ఈ ఎదురుకాల్పుల్లో ఏకంగా 31 మందికి పైగా మావోయిస్టులు మరణించారు.ఈ ఏడాది జరిగిన అతిపెద్ద ఎన్ కౌంటర్ ఇదేనని అధికారులు వెల్లడించారు. అయితే, 2026 నాటికి మావోయిస్టుల మూలాలు లేకుండా చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో భేటీ అయి వారికి దిశానిర్దేశిం చేసిన విషయం తెలిసిందే.