ప్రైవ‌సీ పాల‌సీకి ఓకే చెప్ప‌క‌పోతే అకౌంట్లు డిలీట్ చేస్తాం.. ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన వాట్సాప్‌..

-

మే 15వ తేదీ వ‌ర‌కు వాట్సాప్‌కు చెందిన నూత‌న ప్రైవ‌సీ పాల‌సీకి ఓకే చెప్ప‌క‌పోతే అలాంటి యూజ‌ర్ల ఖాతాల‌ను డిలీట్ చేస్తామ‌ని వాట్సాప్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే విష‌యాన్ని వాట్సాప్ మ‌రోమారు కోర్టులోనూ స్ప‌ష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టులో వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీ విష‌యంపై సోమ‌వారం వాద‌న‌లు జ‌ర‌గ్గా వాట్సాప్ త‌మ నిర్ణ‌యంలో ఎలాంటి మార్పు లేద‌ని తెలిపింది. మే 15వ తేదీ వ‌ర‌కు ప్రైవ‌సీ పాల‌సీని అంగీక‌రించ‌ని యూజ‌ర్ల ఖాతాల‌ను డిలీట్ చేస్తున్నామ‌ని వాట్సాప్ తెలిపింది. ఈ క్ర‌మంలోనే వాట్సాప్ త‌ర‌ఫున వాదించిన ప్ర‌ముఖ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ కూడా ఇదే విష‌యాన్ని కోర్టుకు తెలిపారు.

accounts will be deleted those who do not accept policy says whatsapp

ఫిబ్ర‌వ‌రి 8, 2021 నుంచి నూత‌న ప్రైవ‌సీ పాల‌సీ అమ‌లులోకి వ‌స్తుంద‌ని, ఆ తేదీలోగా పాల‌సీని అంగీక‌రించక‌పోతే యూజ‌ర్ల ఖాతాలను డిలీట్ చేస్తామ‌ని వాట్సాప్ జ‌న‌వ‌రి, 2021లో ప్ర‌క‌టించింది. అయితే ఈ విష‌యంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావడం, వాట్సాప్‌కు చెందిన చాలా మంది యూజ‌ర్లు టెలిగ్రామ్‌, సిగ్న‌ల్ వంటి యాప్‌ల‌కు మార‌డంతో వాట్సాప్ త‌న నిర్ణ‌యాన్ని కొంత కాలం వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అందులో భాగంగానే మే 15వ తేదీని మ‌రో డెడ్‌లైన్ గా ప్ర‌క‌టించింది. అయితే ఆ గడువును ఇక పొడిగించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది.

కాగా పిటిష‌నర్లు, వాట్సాప్ త‌ర‌ఫు న్యాయవాదుల వాద‌న‌ల‌ను విన్న కోర్టు ఈ కేసును జూన్ 3వ తేదీ వ‌ర‌కు వాయిదా వేసింది. యూజ‌ర్ల‌ను వాట్సాప్‌లో కొన‌సాగించేందుకు తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, అయితే వారు ప్రైవ‌సీ పాల‌సీని అంగీక‌రించ‌క‌పోతే వారి ఖాతాల‌ను నెమ్మ‌దిగా డిలీట్ చేస్తామ‌ని వాట్సాప్ స్ప‌ష్టం చేసింది.

ఈ ఏడాది జనవరిలో వాట్సాప్ వివాదాస్పద ప్రైవ‌సీ పాల‌సీని ప్ర‌క‌టించింది. దాని ప్ర‌కారం వాట్సాప్ తన మాతృ సంస్థ ఫేస్‌బుక్‌తో, వ్యాపార ఖాతాలతో యూజ‌ర్ల డేటాను పంచుకోవడానికి అనుమతిస్తుంది. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యంపై ప‌లువురు పిటిష‌నర్లు కోర్టును ఆశ్ర‌యించారు. అయితే చివ‌ర‌కు కోర్టు ఏమ‌ని తీర్పు ఇస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news