వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ హింసరాజులాగా మారిపోయారని, ఆయన ప్రసంగం పాత చింతకాయ పచ్చడిలా ఉందని విమర్శించారు. కేసీఆర్ చెప్పిందే చెప్పి విసిగిస్తున్నారని, ఆయన ప్రసంగం కొత్త సీసాలో పాత సారాయిలాగా ఉందని అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, కానీ కేసీఆర్ మాత్రం పాత విషయాలనే పదే పదే ప్రస్తావిస్తున్నారని సెటైర్లు వేశారు.
ఆయన హింసరాజులాగా మారిపోయారు అని అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వరంగల్ సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన ఇంకా పాత రోజుల్లోనే ఉన్నట్లుగా ఉందని అన్నారు. కేసీఆర్ తన పాత వైఖరిని మార్చుకుని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఆయన సూచించారు.