క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్న ఆసియా కప్-2022 ఆరంభమైంది. నేడు తొలి ఆసియా కప్ సమరం మొదలుకానుంది. శనివారం శ్రీలంక తో జరుగనున్న తొలి పోరులో టాస్ గెలిచిన ఆప్ఘనిస్తాన్ బౌలింగ్ ఎంచుకున్నది. టీ20ల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు బలమైన రికార్డ్ ఉంది. రషీద్‌ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్, మహమ్మద్ నబీపైనే ఆప్ఘనిస్తాన్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది. మరోవైపు గత కొన్నాళ్లుగా వరుస ఓటములతో డీలా పడిన శ్రీలంక ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్ లో రాణించి జోరు మీదున్నది. నిషాంక సారథ్యంలో ఈ యువ ఆటగాళ్లతో కూడిన లంక తొలి మ్యాచ్ లో గెలిచేందుకు భారీగా ప్లాన్స్ వేస్తోంది.
ఆసియా ఖండంలోని ఆరు దేశాలు ఆడుతున్న ఈ మెగా టోర్నీ వేదికలు, తేదీలు మారుతూ.. అసలు జరుగుతుందా..? లేదా..? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎట్టకేలకు యూఏఈలో 15వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో శ్రీలంక.. ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతున్నది. గ్రూప్-బి (శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్) లో భాగంగా ఉన్న లంక, ఆప్ఘాన్ లు తొలి మ్యాచ్ లో గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి.స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉన్న దుబాయ్ పిచ్ లో ప్రపంచపు అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్న రెండు జట్లు ఎలా ఆడతాయని ఇరు జట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.