ఎయిర్‌టెల్‌ 5జీ ప్లాన్‌ ఇదే.. టారిఫ్‌లు పెంచేందుకూ సంకేతాలు

-

ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ తన 5జీ ప్లాన్‌ను ప్రకటించింది. ఆగస్టులోనే సేవలు ప్రారంభం కానున్నాయని పేర్కొంది. 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాలు, ముఖ్యమైన గ్రామీణ ప్రాంతాలకూ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ గోపాల్‌ విఠల్‌ తెలిపారు. అదే సమయంలో టారిఫ్‌ల పెంపునకు సంకేతాలు ఇచ్చారు.

‘ఆగస్టు లోనే 5జీ సేవలు ప్రారంభించనున్నాం. 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పట్టణం, ముఖ్యమైన గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించనున్నాం. ఇప్పటికే 5వేల పట్టణాలకు సేవల విస్తరణకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. ఎయిర్‌టెల్‌ చరిత్రలోనే ఇదే అతిపెద్ద విస్తరణ ప్రణాళిక’ అని అన్నారు.

ఇటీవల 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో ఎయిర్‌టెల్‌ 19,867.8 MHz స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది. తక్కువ ఫ్రీక్వెన్సీతో, అధిక ప్రాంతం-భవనాలలోపల కవరేజీకి అనువైన 700 MHz బ్యాండ్‌ను జియో మాత్రమే కొనుగోలు చేసింది. దీనికి మొబైల్‌ టవర్లు తక్కువ సంఖ్యలో అవసరం అవుతాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. 5జీ సేవల కోసం 700 MHz బ్యాండ్‌ అవసరాన్ని తోసిపుచ్చారు. 900 MHzతో పోలిస్తే 700MHz బ్యాండ్‌ వల్ల ఒనగూరే అదనపు ప్రయోజనాలేవీ లేవన్నారు. ఒకవేళ 900 MHz బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ లేకపోయి ఉంటే ఆ బ్యాండ్‌వైపు చూడాల్సి వచ్చేదని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మొబైల్‌ టారిఫ్‌ల సవరణకు సంకేతాలిచ్చారు. దేశంలో మొబైల్‌ సేవల ధరలు ఇప్పటికీ తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌కు వ్యక్తి  నుంచి వచ్చే సగటు ఆదాయం (ఆర్పు) రూ.183గా ఉందన్నారు. త్వరలోనే రూ.200కు చేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ మొత్తం రూ.300కు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆ కంపెనీ ఐదింతల లాభంతో రూ.1607 కోట్లు ఆర్జించింది.

Read more RELATED
Recommended to you

Latest news