ఎప్పుడూ ఏదో ఒక రాజకీయ కామెంట్ చేస్తూ వార్తల్లో ఉంటారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. బీజేపీతో పొత్తు కట్ చేసుకున్న తర్వాత నుంచి ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరో వైపు మహారాష్ట్రలోని మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంలోని ఎన్సీబీ, శివసేన నాయకులపై ఈడీ దాడులను ఖండిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు సంజయ్ రౌత్.
ఇదిలా ఉంటే తాజాగా ఆర్ఎస్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. వచ్చే 15 ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం అవుతునంది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా సంజయ్ రౌత్… ముందుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్( పీఓకే) ను ఇండియాలో కలపడండి.. ఆ తరువాత శ్రీలంక, పాకిస్తాన్ లను కూడా కలుపుకోండి మిమ్మల్ని ఎవ్వరూ ఆపడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ఈ హమీని కేవలం 15 రోజుల్లో చేయాలని… 15 సంవత్సరాల్లో కాదంటూ వ్యాఖ్యానించారు. దీంతో పాటు కాశ్మీరీ పండిట్ల ఘర్ వాపసీని అమలు చేయాలని ఆయన కోరారు.