కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని ఆలయాలన్నీ మూతబడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా చర్చిలు, మసీ దులు, ఆలయాల తలుపులు తెరుచుకోలేదు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్‌లాక్ మార్గదర్శకాలతో తిరిగి ఆయా ప్రార్థనా మందిరాలు తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ప్రముఖ అక్షరథామ్ దేవాలయాన్ని ఏడు నెలల తర్వాత మంగళవారం తిరిగి తెరవనున్నారు. కరోనా వ్యాప్తి వల్ల అక్షరథామ్ ఆలయాన్ని ఏడు నెలలుగా మూసి ఉంచిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం 5 నుంచి ఆరున్నర గంటల వరకు కేవలం గంటన్నర కోసమే భక్తులను అనుమతించాలని నిర్ణయించారు.
కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూనే పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు చెప్పారు. అక్షరథామ్ ఆలయానికి వచ్చే భక్తులు సాయంత్రం వాటర్ షో, గార్డెన్, ఫుడ్ కోర్టులు, పుస్తకాలు, గిఫ్ట్ సెంటర్లను సందర్శించవచ్చని ఆలయ అధికారులు చెప్పారు. భక్తులు మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.