ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్‌లలో.. టిక్‌టాక్‌ సహా నిషేధిత యాప్‌లన్నీ మాయం..

కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌, షేరిట్‌, హలో సహా మొత్తం 59 యాప్‌లను నిషేధించిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం ఈ యాప్‌లు గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లలో మాయమయ్యాయి. ఈ యాప్‌లను నిషేధించడంతో వీటిని ఆయా యాప్‌ స్టోర్‌ల నుంచి గూగుల్‌, యాపిల్‌ కంపెనీలు తొలగించాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఈ యాప్‌లను వాడుతున్నవారు తప్ప కొత్తగా ఈ యాప్‌లను ఎవరూ డౌన్‌లోడ్‌ చేసుకోలేరు.

all 59 banned chinese apps removed from google play store and apple app store

కాగా తమ యాప్‌ను బ్యాన్‌ చేయడంపై టిక్‌టాక్‌ ఇండియా హెడ్‌ నిఖిల్‌ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తమ టిక్‌టాక్‌ యాప్‌తోపాటు మొత్తం 59 చైనీస్‌ యాప్స్‌ను నిషేధించిందన్నారు. దీనిపై సంబంధిత అధికారులను త్వరలోనే సంప్రదిస్తామని అన్నారు. టిక్‌టాక్‌ తన యూజర్ల డేటా, ప్రైవసీకి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, వారి సమాచారాన్ని చైనాతోసహా ఇతర ఏ దేశానికీ తాము చేరవేయలేదని స్పష్టం చేశారు. ఇకపై కూడా వారి డేటాను సురక్షితంగా ఉంచుతామని తెలిపారు. టిక్‌టాక్‌ మొత్తం 14 భారతీయ భాషల్లో లభిస్తుందని, ఎన్నో కోట్ల మంది ఇండియన్లు దీన్ని వాడుతున్నారని, దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి జీవనాధారం లభిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.

అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం.. చైనా యాప్‌లు ఇండియన్ల డేటాను తస్కరిస్తున్నాయని చెబుతూ వాటిని బ్యాన్‌ చేసింది. ఈ క్రమంలోనే టిక్‌టాక్‌ దీనిపై పై విధంగా స్పందించింది. ఇక ఈ యాప్‌లన్నీ ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లలో యూజర్లకు అందుబాటులో లేవు.