50 పైసలు మొదలుకొని ఆ పైన ఉండే నాణేలు అన్నీ చెల్లుబాటవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక ప్రకటనలో తెలిపింది.
ఎవరు పుకారు పుట్టించారో తెలియదు కానీ.. ఇప్పటికీ మన దేశంలో అనేక చోట్ల రూ.10 నాణేలను తీసుకోవడం లేదు. ఇక 50 పైసల నాణేలనైతే ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అనేక చోట్ల చిల్లర ఇచ్చే సమయాల్లో వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక కొన్ని చోట్లయితే ఏకంగా పరస్పరం దాడులు కూడా చేసుకుని గాయాల బారిన పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆర్‌బీఐ ఈ నాణేల చెల్లుబాటుపై ప్రకటనలు ఇస్తున్నా వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ ఇవాళ కూడా మరొక ప్రకటన చేసింది.
50 పైసలు మొదలుకొని ఆ పైన ఉండే నాణేలు అన్నీ చెల్లుబాటవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10 నాణేలు అన్నీ చెల్లుతాయని, అందరూ వాటిని తీసుకోవాల్సిందేనని, లేకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది. ఆయా నాణేలు కాలానుగుణంగా భిన్నమైన మార్పులకు లోనై పలు రకాల ఆకృతుల్లో, డిజైన్లలో వినియోగదారులకు లభిస్తున్నాయని, అంతమాత్రం చేత కొన్నినాణేలను చెల్లవని తిరస్కరించకూడదని ఆర్‌బీఐ తెలిపింది.
ఎవరైనా సరే.. పైన చెప్పిన అన్ని నాణేలను విధిగా తీసుకోవాల్సిందేనని, ఎవరైనా నిర్దిష్టమైన నాణేలను తీసుకోకుండా తిరస్కరిస్తే వారిపై తమకు ఫిర్యాదు చేయవచ్చని కూడా ఆర్బీఐ తెలిపింది. అయితే రూ.5, రూ.10 నాణేల్లో ఆకృతి, డిజైన్ పరంగా ఉన్న కొన్ని మార్పుల వల్ల కొందరు అసలు నాణేలను కూడా నకిలీ నాణేలని భావించి వాటిని తీసుకునేందుక నిరాకరిస్తున్నారని ఆర్‌బీఐ పరిశీలనలో వెల్లడైంది. ఈ క్రమంలో అన్ని నాణేలు చెల్లుతాయని, నిరభ్యంతరంగా వాటిని వాడుకోవచ్చని కూడా ఆర్‌బీఐ వెల్లడించింది.