ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. జీఎన్ రావు కమిటీ మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి వాసులు భగ్గుమంటుంటే.. విశాఖ వాసులు మాత్రం స్వాగతిస్తున్నారు. అమరావతి నుండి రాజధానిని మారుస్తారన్న వ్యాఖ్యలపై అక్కడి రైతుల తీవ్రంగా మండిపడుతున్నారు. గత కొద్దిరోజులుగా వీరి ఆందోళన చర్చనీయాంశయంగా మారింది.. ఇతర వర్గాల ప్రజలు కూడా ఇందులో చేరారు. అమరావతిలో రైతుల ఆందోళన బుధవారం ఎనిమిదో రోజుకు చేరుకోవడంతో ప్రజలు వివిధ రూపాల ద్వారా తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ‘వన్ స్టేట్-వన్ క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్-క్యాపిటల్ అమరావతి’ నినాదాలతో ఆందోళనలు చేశారు.
ప్రపంచ స్థాయి రాజధానిని ఇక్కడ నిర్మిస్తానని చంద్రబాబు అంటే తామంతా నమ్మి భూములు ఇచ్చామని.. తీరా జగన్ తమను నట్టేటా ముంచుతున్నారని ఆరోపించారు. మరోవైపు, ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్, అడ్వకేట్స్ జెఎసితో కలిసి ప్రకాశం బ్యారేజీపై గురువారం మెగా ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నిరసనలలో వివిధ జిల్లాల నుండి ప్రాక్టీసింగ్ న్యాయవాదులు పాల్గొంటున్నారని తెలిపారు. హైకోర్టును ఇక్కడి నుంచి కర్నూలుకు మార్చాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపడతామని హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి పీతా రామన్ తెలిపారు.