అమరావతి రైతులు తలపెట్టిన మహాపాదయాత్ర 2.0కు హైకోర్టు అనుమతించింది. యాత్ర కోసం రైతులు సిద్ధమవుతున్నారు. ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులకు చేరుకుంటున్న సందర్భంగా ఈ నెల 12న తుళ్లూరు మండలం వెంకటపాలెంలో మహా పాదయాత్ర మొదలవుతుంది. దీనికి వేద పండితులు 12వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ సమయానికి వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
అనంతరం ఉదయం 6 గంటలకు పాదయాత్రకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన శ్రీవారి రథాన్ని ఆలయం నుంచి వెంకటపాలెం గ్రామంలోకి తీసుకొస్తారు. 9 గంటలకు రథానికి జెండా ఊపి.. లాంఛనంగా పాదయాత్రను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి వైకాపా మినహా అన్ని పార్టీల నేతలను అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస సమన్వయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు.
ఇందులో పాల్గొనేందుకు టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఆప్, కాంగ్రెస్ తదితర పార్టీలు అంగీకరించాయి. వెంకటపాలెం నుంచి కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి పాదయాత్ర చేరుకుంటుంది. రాత్రికి అక్కడే బసచేస్తారు. మహాపాదయాత్ర 2.0 విజయవంతం చేయాలని అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస సమన్వయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.