అందుకే రాజీనామా చేశా : అమ‌రీంద‌ర్ సింగ్

అనేక నాట‌కీయ ప‌రిణామాల మధ్య పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే తాను రాజీనామా చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను తాజాగా అమ‌రీంద‌ర్ సింగ్ వెల్ల‌డించారు. చర్చలు జరిగిన తీరుతో తాను అవమానానికి గురయ్యానని చెప్పారు. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ అధ్యక్షురాలితో మాట్లాడానని..ఈరోజు రాజీనామా చేస్తానని చెప్పానన్నారు. ఇటీవలి నెలల్లో ఎమ్మెల్యేలను కలవడం ఇది మూడోసారి అని చెప్పారు.

దీన్ని తాను చాలా అవమానంగా భావిస్తున్నా అని ,అందుకే సీఎం పదవికి రాజీనామా చేశానని చెప్పారు. ప్ర‌స్తుతం తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, త‌న‌ మద్దతుదారులతో సంప్రదించి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తానని అన్నారు. రాజీనామా అంశాన్ని సోనియాగాంధీ కి వివరించానని..పార్టీ పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తిని అధిష్ఠానం సీఎం గా ఎంపిక చేస్తుందని అమ‌రీంద‌ర్ సింగ్ చెప్పుకొచ్చారు.