35 రైతు సంఘాల నేతలతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక చర్చలు జరపనుంది. ముందుగా, ఈ రోజు ఉదయం పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ముఖాముఖి సమావేశం కానున్నారు. అమిత్ షా తో భేటీ కోసం, ఈ రోజు ఉదయం 8 గంటలకు ఢిల్లీకి బయల్దేరి రానున్నారు పంజాబ్ ముఖ్యమంత్రి. ఈ రోజు ఉదయం 9.30 నుంచి 10 గంటల మధ్య అమిత్ షా, కెప్టెన్ అమరీందర్ సింగ్ ల మధ్య చర్చలు జరగనున్నాయి.
ఆ తర్వాత రైతు సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో జాతీయ రహదారుల పైనే వేలాది రైతుల బైఠాయింపు కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా రైతులను ఆందోళనకు ఉద్యుక్తులను చేసే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.