మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఇటీవల చంద్రబాబు కోనసీమ జిల్లాలో పర్యటించి గోదావరి వరద బాధితులను పరామర్శించడం తెలిసిందే. దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. వరద బాధితుల పరామర్శకు ఎవరైనా పార్టీ జెండాలతో వెళతారా? అంటూ ప్రశ్నించారు అంబటి రాంబాబు. వరద బాధితుల వద్దకు చంద్రబాబు టీడీపీ జెండాలతో వెళ్లడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు అంబటి రాంబాబు. ఓవైపు వరద బాధితుల ఇబ్బందులు చూడకుండా, చంద్రబాబు పార్టీ జెండాలతో, కార్యకర్తలతో రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు అంబటి రాంబాబు.
ఈ ఏడాది వరదలు ఎంతో ముందుగా వచ్చాయని, జగన్ పాలనలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, చంద్రబాబు పాలనలో వర్షాలే లేవని అన్నారు అంబటి రాంబాబు. అసలు, చంద్రబాబు పాలనలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడమే జరగలేదని వెల్లడించారు. చంద్రబాబు అహంభావం వల్లే పోలవరం నిర్మాణం ఆలస్యమైందని, ఎవరైనా కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రం వాల్ నిర్మిస్తారా? అని అంబటి రాంబాబు నిలదీశారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడం టీడీపీ తప్పిదమేనని స్పష్టం చేశారు అంబటి రాంబాబు.