సూపర్‌ స్టార్‌ మద్దతు బీజేపీకి లభిస్తుందా..అమిత్ షా టూర్ పై తమిళనాట ఆసక్తి

-

జయలలిత, కరుణానిధి లేరు. రజనీకాంత్ వస్తాడో రాడో తెలియదు. స్టాలిన్‌ స్టామినాపై నమ్మకం లేదు. కమల్‌హాసన్‌కు కేడర్ లేదు. అన్నాడీఎంకేని నడిపించే లీడర్‌ లేడు. అమిత్‌షా లాంటి కాకలు తీరిన రాజకీయ వ్యూహకర్తకు ఇంత కంటే మంచి అవకాశం ఏముంటుంది అమిత్‌షా ప్రస్తుత పర్యటన.. తమిళనాట బీజేపీ అధికారానికి బాటలు వేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తమిళనాడు పర్యటనలో ఉన్న అమిత్‌షా రజినీకాంత్‌తో కలుస్తారా ? వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో సూపర్‌ స్టార్‌ మద్దతు.. బీజేపీకి లభిస్తుందా అలాగే అళగిరి.. బీజేపీలో చేరతారా ? ఈ ప్రశ్నలకు ఇవాళ సమాధానం దొరికే ఛాన్స్‌ ఉంది. మరోవైపు బీజేపీతో తమ మైత్రి కొనసాగుతుందని సీఎం పళని స్వామి ప్రకటించడంతో.. తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందని సీఎం పళనిస్వామి తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనలో ఉన్న సందర్భంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడు ఎల్లప్పుడూ సహకరిస్తుంది’ అని అన్నారు. మరోవైపు అమిత్‌ షా కూడా.. కరోనా పై పోరాటం విషయంలో తమిళనాడు ప్రభుత్వం గొప్పగా పనిచేసిందని ప్రశంసించారు. జయలలిత మరణం తర్వాత అధికారం తమదే అనే ధీమాలో ఉంది డీఎంకే. కరుణానిధి మరణంతో డీఎంకేలోనూ ఉత్సాహం తగ్గింది. పార్టీని నడపడంలో స్టాలిన్ తడబడుతున్నారు.

తమిళులకు హిందీ అంటే పడదు. అమిత్‌షా, నరేంద్రమోడీ హిందీలో మాట్లాడినంత అనర్గళంగా పేపర్ చూడకుండా ఇంగ్లీష్, తమిళంలో మాట్లాడలేరు. కానీ స్థానిక నాయకులు మాట్లాడతారు. నగరాలు, పట్టణాలు పక్కన పెడితే.. గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకు పోవాలంటే… తమిళనాట బీజేపీకి బలమైన నేత అవసరం. అలాంటి నేత ఎవరు?. నిన్న మొన్నటి వరకూ పార్టీ పెడతానని చెప్పిన రజనీకాంత్.. బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. రజనీని ఆకర్షించేందుకు బీజేపీతో పాటు మిగతా పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల నాటికి రజనీ పార్టీ పెట్టకపోతే.. బీజేపీకి మద్దతు ప్రకటించే అవకాశం పుష్కలం.

వచ్చే పుట్టిన రోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుపుకుంటానని తన బర్త్‌డే రోజు కమల్ హాసన్ ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారం దక్కుతుందని ఆశించడం తప్పు కాకపోవచ్చు కానీ.. అందుకు తగిన గ్రౌండ్ వర్క్ చేయడం కూడా అవసరం. బీజేపీ స్థాయిలో కమల్ ఏం చేస్తున్నాడని చూస్తే.. ఏమీ కనిపించడం లేదు. మక్కల్ నీదిమయ్యం పార్టీని వార్డ్ స్థాయిలోకి తీసుకెళ్లే కార్యక్రమం ఏదీ ఇంత వరకూ జరగలేదు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం మీద కమల్ దృష్టి పెట్టలేదు.

బీహార్ తర్వాత బీజేపీ టార్గెట్ పశ్చిమబెంగాల్, తమిళనాడు. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా తమ శక్తి యుక్తులన్నింటినీ ఈ రెండు రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తోంది కాషాయదళం. నగరాలు, పట్టణాలు, గ్రామాలు ఏదైనా కావచ్చు. అమిత్‌షా రాజకీయం అంతా బూత్‌ స్థాయిలోనే మొదలవుతుంది. తమిళనాట ఇప్పటికే బీజేపీ శ్రేణులు బూత్‌ స్థాయిలో పని చేస్తున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట బీజేపీ జండా ఎగిరినా.. అక్కడ బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినా.. కొత్త చరిత్రకు పునాది పడినట్లే.

Read more RELATED
Recommended to you

Latest news