పోలీసు అధికారుల కొంపలో చిచ్చు పెట్టిన బెట్టింగ్ మాఫియా… తెలంగాణాలో సంచలనం…!

కామారెడ్డిలో ఇప్పుడు బెట్టింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. పలువురు పోలీసు అధికారుల పేర్లు బయటకు రావడంతో పోలీసు అధికారులలో ఆందోళన మొదలయింది. ఏసీబీ అధికారులు వరుస సోదాలు నిర్వహిస్తున్నారు. దీనితో పోలీసు శాఖలో ఉన్న వారు కంగారు పడుతున్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో 5 లక్షల మామూళ్లు వ్యవహారంలో ఇప్పటికే సిఐ జగదీష్ అరెస్ట్ అయ్యాడు. ఆయనను రిమాండ్ కి తరలించారు.

బెట్టింగ్ రాయుళ్లకు మధ్యవర్తిగా వ్యవహరించిన సుజయ్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. సుజయ్ ద్వారా మామూళ్లు తీసుకున్న పోలీసుల వివరాలు ఏసీబీ అధికారులు సేకరించి విచారిస్తున్నారు. సిఐ జగదీశ్ ఇంట్లో సోదాల సమయంలో నగదు గుర్తించగా ఆ నగదు డిఎస్పీకి చెందినట్టుగా గుర్తించారు. మామూళ్ల విషయంలో ఎస్సైలు, డిఎస్పీ పాత్రతో పాటు కింది స్థాయి సిబ్బంది హస్తం ఉందని ఏసీబీ విచారణలో బహిర్గతం అయింది. నిన్న సాయంత్రం నుంచి డిఎస్పీ కార్యాలయంతో పాటుగా ఆయన నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎస్సైలలో ఒకరు సెలవులో ఉండగా మరొకరు పరారీలో ఉన్నారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.