సామాజిక వ్యవహారాల్లో ముందుండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా, తన సిబ్బంది అమలు చేసిన కార్యక్రమాన్ని ఎంతగానో పొగిడారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా ఒక సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తన ఆటోమొబైల్ పరిశ్రమల క్యాంటీన్‌లలో పళ్లాలకు బదులుగా అరిటాకుల్లో భోజనం వడ్డించాల్సిందిగా సిబ్బందికి సూచించారు.
మాజీ జర్నలిస్టు పద్మారామ్‌నాథ్, ఆనంద్‌కు పంపిన ఈమెయిల్‌లో ఈ సలహా ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ జాతీయ స్థాయి లాక్‌డౌన్ పరిస్థితుల్లో అరటిసాగు కొనసాగిస్తూ, నష్టాలు చవిచూస్తున్న రైతాంగానికి కొద్దోగొప్పో మేలు చేసేలా అరిటాకులు కొనుగోలు చేయాలని ఆవిడ తనకు సలహా ఇచ్చిందని తెలిపిన ఆనంద్, ఈ ఐడియా తనకు ఎంతగానో నచ్చిందని ట్వీట్ చేసారు.
తమ అన్ని ఫ్యాక్టరీల సిబ్బంది దీనికి తక్షణమే ఆమోదం తెలిపి, ప్లేట్లు పక్కనబెట్టి, భోజనాలకు అరిటాకులు వాడటం ప్రారంభించారని, వారికి తన ధన్యవాదాలని ఆనంద్ హర్షం వ్యక్తం చేసారు.
ఆనంద్ మహింద్రా చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా అయిపోయి ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. చిన్న, రోజువారీ ఆదాయవర్గాలకు ఇతోధికంగా సాయం చేస్తునందుకు ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.